Thursday, 5 July 2007

మాయాబజార్
కథా వస్తువు
ఇదే కథ తో 1936 సంవత్సరం లో శశిరేఖా పరిణయం పేరు తో ఒక చిత్రం రూపొందించబడింది. దానికి మాయాబజార్ అని మరొక పేరు. అదే పేరుని ఈ చిత్రానికి కూడా పెట్టడం జరిగింది. ఇక కథ విషయానికి వస్తే, మహాభారతంలో జరగని ఒక కల్పిత గాథ, ఈ చిత్ర కథావస్తువు.
దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడితో వివాహం నిశ్చయమైన శశిరేఖను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుడితో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవులను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలు.

మాయాబజార్ ప్రశస్తి


సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే, ఈ చిత్రము ఒక మహాద్భుతమని చెప్పవచ్చు. మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు అజరామరంగా నిలుస్తాయి. ఈ చిత్రంలో రచయిత పింగళి నాగేంద్రరావు తస్మదీయులు, దుష్టచతుష్టయం , జియ్యా , రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం, వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు. రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు వంటి సంభాషణలు మనల్ని గిలిగింతలు పెట్టిస్తాయి.
మాటలు లేని చోటుల్లో కెమెరా మరింత అద్భుతంగా పని చేస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్ల గా ఆడుకుంటున్న శశిరేఖ ఉద్యానవనంలో ఒక కొలని గట్టున అలవోకగా కూర్చుంటుంది. కెమెరా ఆమె మొహమ్మీదనుంచి మెల్లగా పాన్ అయి కొలనులోని తామరమొగ్గను చూపిస్తుంది. గడచి పోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలు రేగడమూ, ఆ మొగ్గ మెల్లగా విచ్చుకోవడమూ, ఆ తర్వాత కెమెరా మెల్లగా వెనక్కి తిరిగి శశిరేఖ మొహాన్ని చూపడమూ జరుగుతాయి. ఇప్పుడక్కడ నవయవ్వనవతి యైన శశిరేఖ అంటే సావిత్రి ఉంటుంది!
ఈ చిత్రానికి మొదటగా సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకులుగా నియమితులయ్యారు. 4 యుగళగీతాలకు స్వర కల్పన చేసాక, కారణాంతరాల వలన ఆయన తప్పుకోగా సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితులయ్యారు. రాజేశ్వరరావు కట్టిన బాణీలకు వాయిద్య సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేసారు ఘంటసాల. ఘంటసాల , పి.లీల , పి.సుశీల , మాధవపెద్ది సత్యం మొదలగు వారి నేపధ్య గానంలో వచ్చిన , నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళా, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునదీ, సుందరి నీవంటి, ఆహ నా పెళ్ళీ అంటా, వివాహభోజనంబు వంటి గీతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. చమత్కారమేమిటంటే ఈ పాటల పల్లవులు తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా వాడుకోబడ్డాయి. ఆలాగే లాహిరి లాహిరి లాహిరిలో అన్న ఒకే పాటకు ముగ్గురు నటులకు (ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ , గుమ్మడి) ఘంటసాల పాడటం ఒక ప్రత్యేక విశేషం.
ఇక స్క్రిప్టు మనల్ని తల తిప్పుకోనీయకుండా చేస్తే మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, హర్బన్స్ సింగ్ స్పెషల్ ఎఫెక్ట్లూ మనల్ని రెప్ప వాల్చనీయకుండా చేస్తాయి. ఈ చిత్రానిది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన స్క్రీన్ ప్లే అని గుమ్మడి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. "లాహిరి లాహిరి లాహిరిలో" పాటను చూసి తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు' అనుకున్న వారు ఆ పాటను మండుటెండలో తీశారని తెలుసుకుని తెల్లబోయారు. ఇక స్పెషల్ ఎఫెక్టులా లెక్కపెట్టలేనన్ని. మచ్చుకు కొన్ని:
అభిమన్యుడి దగ్గరకు తొలిసారి వచ్చినప్పుడు ఘటోత్కచుడు కొండ మీద దూకగానే ఆ అదటుకు కొండకొమ్ము విరిగి పడడమూ,
మాయామహల్లో కంబళి లా కనిపించే గింబళి తనంతట తనే చుట్టుకోవడం,
తల్పం లాంటి గిల్పం గిరగిరా తిరిగి క్రిందపడదోయడం లాంటి విడ్డూరాలు,
ఘటోత్కచుడి "వివాహభోజనం"బు షాట్లు
కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ షాట్లు ఎలా తీయగలిగారనేది తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

పాత్రలు వాటి స్వభావాలు, పాత్రధారులు
ఘటోత్కచుడు

మొదటిసారి చూసినప్పుడు అభిమన్యుడెవరో తనకు తెలియకపోయినా "బాలకా! నీ మీద ఏలనో ఆయుధము ప్రయోగించడానికి చేతులు రావడము లేదు" అని అనురాగం ప్రకటిస్తాడు. రాక్షస విద్యార్థులు 'దుష్టచతుష్టయం' అనే మాటలో ఒత్తులు సరిగా పలకలేక విడివిడిగా 'దుసట చతుసటయం' అని పలుకుతూంటే ఆ తప్పుని సరిదిద్దక దుర్యోధనాదుల్ని గుర్తు చేసుకుని పళ్ళు కొరుకుతూ "వాళ్ళనలాగే విడివిడి చేసి పొడిపొడి చేసెయ్యాలి." అని సమర్థిస్తాడు.
"వివాహభోజనంబు" పాటయ్యాక ఘటోత్కచుడు పెళ్ళివంటకాలన్నీ చూసి ఆత్రం పట్టలేక తొందరగా తినెయ్యాలని గద పక్కన పెట్టి వొళ్ళు పెంచి కూర్చుంటాడు. అన్నీ ఖాళీ చేశాక గద కోసం తడుముకుంటే అది చేతికందనంత చిన్నదిగా ఉంటుంది. ఆ సందర్భంలో ఆ రాక్షసుడు ముందు తికమక పడి, నిదానంగా విషయం అర్థమైనట్లు తలాడిస్తాడు. అలాగే చివరి ఘట్టంలో తన అనుచరులు కౌరవులను చావబాదుతున్నప్పడు "ఆహా! ఆర్తనాదములు శ్రవణానందముగానున్నవి" అని తన రాక్షస ప్రవృత్తిని ప్రకటిస్తాడు.
రేవతి
సాత్యకి రాజసూయ యాగం నుంచి తిరిగొచ్చి మయసభ గురించి వర్ణిస్తూంటే, రేవతి "వనాలూ, తటాకాలూ కూడా మణిమయాలేనా?" అని ఆశగా, ఆశ్చర్యంగా అడుగుతుంది. ప్రియదర్శినిలో ఆమెకు ప్రియమైన వస్తువులుగా మణులు, బంగారం కనిపిస్తాయి. అయితే, ఆ నెపాన్ని రుక్మిణి మీదకు నెట్టేస్తుంది: "ఏమో, నాపక్కన నువ్వున్నావు. నువ్వనుకున్నది కనిపించిందేమో?" అని. పాండవులు రాజ్యం కోల్పోగానే, వాళ్ళ సంబంధం వదులుకోవడానికి ఏ మాత్రమూ సంకోచించని దానిగా ఆమె ధనాశను, అవకాశవాద తత్వాన్ని ఇక్కడ ఈ రెండు మాటల్లోనే సూచించారు.
అప్పటిలో ఈ సినిమాకు 26 లక్షలు రూపాయలు ఖర్చు అయ్యింది. అంత ఖర్చు పెట్టి తీయడం విజయావారికే సాధ్యమయ్యింది. విజయావారి సినిమాలో నటించడం నటీనటులకొక ప్రతిష్టాత్మక విషయంగా భావించేవారు. చాలా మంది కోరిక ఈ మాయాబజార్ సినిమాతో సఫలమయ్యంది. ఈ సినిమాలో నటించిన కొందరు కళాకారులు.
పాత్ర
పాత్రధారి
వ్యాఖ్య
కృష్ణుడు
ఎన్.టి.ఆర్
అంతకు ముందు ఒక సినిమాలో వేసిన కృష్ణుని పాత్రకు మంచి స్పందన రాలేదు. కనుక ఈ సినిమాలో చాలా జాగ్రత్త తీసుకొని ఎన్.టి.ఆర్.కు ఈ పాత్ర, మేకప్ రూప కల్పన చేశారు. తరువాత కధ ఎవరికి తెలియదు?
అభిమన్యుడు
ఏ.ఎన్.ఆర్
శశిరేఖ (బలరాముని కుమార్తె)
సావిత్రి
ఘటోత్కచుడు
ఎస్.వి.రంగారావు
ఈ సినిమాలో పాత్ర చిత్రీకరణ వల్ల తెలుగువారికి ఘటోత్కచుడు చాలా ప్రియమైన వ్యక్తి ఐపోయాడు.
లక్ష్మణ కుమారుడు
రేలంగి
లక్ష్మణ కుమారుని హాస్యగానిగా చూపడం మహాభారత కధలో అతని పాత్రకు అనుగుణంగా లేదు. కాని ఇది "మాయ" బజార్ కదా?
చిన్నమయ
రమణా రెడ్డి
బలరాముడు
గుమ్మడి వెంకటేశ్వరరావు
కృష్ణుడు, బలరాముడు అన్నదమ్ములన్న విషయానికి ప్రాముఖ్యతనివ్వడం కోసం ఒక సీనులో దర్శకుడు ఎన్.టి.ఆర్., గుమ్మడిల ముక్కులలో పోలికలను చూపడానికి ప్రయత్నించారట!
దుర్యోధనుడు
ముక్కామల
శకుని
సి.ఎస్.ఆర్
రేవతీ దేవి (బలరాముని భార్య)
ఛాయా దేవి
సుభద్ర
ఋష్యేంద్రమణి
ఋష్యేంద్రమణికి మొదట రేవతి పాత్ర ఇచ్చారట. కాని గర్విష్టి పాత్ర తనకు ఇష్టంలేక చక్రపాణిని సుభద్ర పాత్ర అడిగి తీసుకొన్నానని ఒకసారి ఋష్యేంద్రమణి టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది.
రుక్మిణి
సంధ్య
ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత తల్లి.
సాత్యకి
నాగభూషణం
కర్ణుడు
మిక్కిలినేని
దుశ్శాసనుడు
ఆర్.నాగేశ్వరరావు
రథ సారది
వల్లూరి బాలకృష్ణ
చిన్నారి శశిరేఖ
సరస్వతి
బాల నటి
చిన్నారి అభిమన్యుడు
ఆనంద్
బాల నటుడు
లంబు
చదలవాడ కుటుంబరావు
జంబు
నాల్ల రామ్మూర్తి
పల్లెటూరి పిల్ల చ్రిత్రంలో లప్పం పాత్రధారి
ధూళిపాళ
మోహన
భానుమతి (దుర్యోధనుని భార్య)
రజని
కృష్ణుడు
కంచి నరసింహారావు
కృష్ణుడు మాయా రూపంలో ఉండి అటు నేనే ఇటు నేనే పాట పాడే పాత్రధారి
శర్మ
అల్లు రామలింగయ్య
దారుకుడు
మాధవపెద్ది సత్యం
శాస్త్రి
వంగర వెంకటసుబ్బయ్య
యశోద
బెజవాడ రాజారత్నం
వినవమ్మా యశోద పాటలో
చిన్ని కృష్ణుడు
బాబ్జీ
వినవమ్మా యశోద పాటలో
సీత
సీత
అలనాటి నటీమణి.

మరిన్ని 'మాయ'లు
అభిమన్యుడి పెళ్ళి చుట్టూ మూడు గంటల సేపు కథ నడిస్తే పాండవులెక్కడా కనిపించకపోయినా వాళ్ళేమయారనే అనుమానమెక్కడా ప్రేక్షకులకు రాలేదంటే అది దర్శకుడు పన్నిన మాయాజాలమే.
"అహ నా పెళ్ళంట.." పాటలో తధోంధోంధోం తధీంధీంధీం అనే బిట్ ని పాడింది మాధవపెద్ది సత్యం కాదు. ఘంటసాల.
"దురహంకార మదాంధులై.." అనే పద్యానికి ముందు వచ్చే "విన్నాను మాతా విన్నాను.." అనే సుదీర్ఘమైన డైలాగ్ ను పలికింది రంగారావు కాదు. మాధవపెద్ది సత్యం.
ఆశ్చర్యం: ఈ సినిమాలో కర్ణుడికి అసలు కవచ కుండలాలే లేవు.
ఈ చిత్రంలో ప్రముఖ నేపథ్య గాయకులు మాధవపెద్ది సత్యం , భళి భళి భళి భళి దేవా గీతంలో రథసారథి పాత్రలో కనిపించి మనల్ని అలరిస్తారు.

పాటలు. పద్యాలు
ఈ సినిమాలో హిట్టయిన పాటలకు సాలూరు రాజేశ్వరరావు అసలు సంగీత దర్శకుడు. (చూపులు కలసిన శుభవేళా, నీవేనా నను తలచినది, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునది) కానీ చక్రపాణితో వచ్చిన విభేదాలవలన సాలూరు తప్పుకొనగా మిగిలిన సంగీతాన్ని ఘంటసాల అందించాడు. అయితే సినిమా టైటిల్స్‌లో సాలూరు రాజేశ్వరరావు పేరు చూపలేదు.
పాట / పద్యం
గీతరచన
నేపథ్యగానము
నీవేనా నను తలచినది
ఘంటసాల వెంకటేశ్వరరావు
లాహిరి లాహిరి లాహిరిలో
ఘంటసాల వెంకటేశ్వరరావు
వివాహ భోజనంబు
మాధవపెద్ది సత్యం
అహనా పేళ్ళంట
భళి భళి భళి దేవా
మాధవపెద్ది సత్యం
చూపులు కలసిన శుభవేళ
ఘంటసాల వెంకటేశ్వరరావు
నీకోసమె నే జీవించునది
ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల
సుందరి నీవంటి దివ్య స్వరూపము
ఘంటసాల వెంకటేశ్వరరావు
దయచేయండి దయచేయండి
విన్నావటమ్మా ఓ యశోదమ్మా
వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా
ఎమ్.ఎల్.వసంతకుమారి
అఖిల రాక్షస మంత్ర (పద్యం)
లల్లిలలా లల్లిలలా
ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు
అష్టదిక్కుంభి కుంభాగ్రాలపై (పద్యం)
మాధవపెద్ది సత్యం
దురహంకార మదాంధులై ఖలులు విద్రోహంబు కావించిరే (పద్యం)
మాధవపెద్ది సత్యం
శకునియున్న చాలు శనియేల అని గదా (పద్యం)
సి.ఎస్.ఆర్.ఆంజనేయులు

ఎన్ని మాయాబజార్లు?
అసలు మహాభారతంలో లేని ఈ కధ భారతీయ సినిమా వారికి బాగా ఇష్టమైన కధావస్తువు అనిపిస్తుంది. మొత్తం పదికి పైగా సినిమాలు ఈ ఇతివృత్తంతో వచ్చాయి.
మూగసినిమాల కాలంలో "మాయాబజార్" లేదా "సురేఖా హరన్" - 1925లో విడుదలయ్యింది. బాబూరావు పైంటర్ దర్శకత్వంలో వచ్చింది. ఇందులో కధానాయకుడు శాంతారాం.
అదే పేరుతో 1932లో నానూభాయి పటేల్ దర్శకత్వంలో వచ్చింది.
అదే సినిమా తమిళంలో "మాయాబజార్" లేదా "వత్సల కళ్యాణ్" గా వచ్చింది. తమిళ రూపకానకి ఆర్.పద్మనాభన్ దర్శకుడు.
పి.విదాస్ దర్శకత్వంలో 1935లో "మాయాబజార్" లేదా "శశిరేఖా పరిణయం" పేరుతో తెలుగు సినిమాగా వచ్చింది. ఇందులో శశిరేఖగా శాంతకుమారి నటించింరది.
మరాఠీ మాయాబజార్ జి.వి.పవార్ దర్శకత్వంలో 1939లో వచ్చింది.
ధర్మదత్తాధికారి దర్శకత్వంలో "మాయాబజార్" లేదా "వత్సలా హరన్" గా 1949లో హిందీ, మరాఠీ భాషలలో తీశారు.
నానాభట్ సినిమా "వీర ఘటోత్కచ" లేదా "సురేఖా హరన్" 1949లో వచ్చింది. ఇందులో శశిరేఖగా మీనాకుమారి నటించింది.
తెలుగు, తమిళ భాషలలో కె.వి.రెడ్డి దర్శకత్వంలో 1957లో వచ్చిన ప్రఖ్యాత "మాయాబజార్" దీనిని 1971లో హిందీలోకి డబ్బింగ్ చేశారు.
బాబూభాయి మిస్త్రీ 1958లో తీసిన మాయాబజార్‌లో కధానాయిక అనితా గుహా. తరువాత ఈ సినిమా "వీర ఘటోత్కచ" పేరుతో తెలుగు, తమిళ, కన్నడ భాషలలోకి అనువదింపబడింది.
శాంతిలాల్ సోనీ హిందీలో "వీర్ ఘటోత్కచ" సినిమా తీశాడు.
హిందీలోను, గుజరాతీలోను 1984లో బాబూభాయి మిస్త్రీ "మాయాబజార్" చిత్రం రంగులలో నిర్మించాడు.
ఇదే పేరుతో దాసరి నారాయణరావు ఒక సాంఘిక చిత్రాన్ని నిర్మించాడు.

మరికొన్ని విశేషాలు
మార్చి 2007లో ఈ సినిమాకు 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రముఖ టెలివిజన్ ఛానళ్ళు ప్రత్యేక కార్యక్రమాలను సమర్పించాయి. పత్రికలు విశేష వ్యాసాలు ప్రచురించాయి. పత్రికలలో వచ్చిన శీర్షికలు ఇలా ఉన్నాయి - "యాభై ఏళ్ళ 'మాయా'బజార్", "మనయింటి బంగారం మాయాబజార్", "తెలుగు సినిమాకు పెద్దబాల శిక్ష మాయాబజార్", "అర్ధ శతాబ్ది అద్భుత అనుభూతి మాయాబజార్"
ఎస్.వి.కృష్ణారెడ్డి ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో అన్నది - "ప్రేక్షకులు వైవిధ్యం కోరుకుంటారు. మంచి సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూస్తారంటే ఇక మాయాబజార్ తరువాత వేరే సినిమా రానక్కరలేదు"
ఈ సినిమాలో హీరో ఎవరు? అని తెలుగు సినిమా వజ్రోత్సవ సందర్భంలో టీవీ యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు అక్కినేని నాగేశ్వరరావు ఇలా జవాబు చెప్పాడు - "డ్యూయెట్ పాడినవాడు హీరో అయితే నేను హీరోను. ఫైట్లు చేసినవాడయితే ఎస్.వీ.రంగారావు. మగవాడు కాని హీరో సావిత్రి...."
'కిన్నెర ఆర్ట్ థియేటర్' వారు మే 2007లొ మాయాబజార్ స్వర్ణోత్సవం సభ ఏర్పాటు చేసి, ఆ సినిమాలో నటించిన నటులను సత్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ప్రఖ్యాత కవి రాళ్ళబండి కవితాప్రసాద్ మాయాబజార్ సినిమా ఇంత ఆదరణ పొందడానికి కొన్ని కారణాలను విశ్లేషించాడు.
పాత్రల ప్రవర్తన: మాయాబజార్‌లో పాత్రలు, వాటి స్వభావాలు మన నిత్యజీవనంలో ఇరుగుపొరుగువారి ప్రవర్తనకు చాలా దగ్గరఱగా ఉన్నాయి. కనుక ఆ పాత్రలతో ప్రేక్షకులకు ఒక అనుబంధం ఏర్పడింది.
భాష: మాయాబజార్‌లో పాత్రలు మాట్లాడిన భాష గ్రాంధికంలా అనిపించదు. అలాగని ఫక్తు నేటి వ్యావహారికం కాదు. అందుకే ప్రేక్షకులకు ఆ సినిమాలో ప్రతి డైలాగు సుపరిచితమయ్యింది.

2 comments:

oremuna said...

source ?

Anonymous said...

From Telugu wikipedia